శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య
పల్లవి, హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సన్మానించారు. పూణేలో జరిగిన ఆసియా ఓసియానియా టోర్నమెంట్ గ్రూప్ వన్ లో హాంగ్ కాంగ్ తో జరిగిన లీగ్ మ్యాచ్లో 2-–1తో శ్రీవల్లి అదరగొట్టింది. ఈ మేరకు అవకాశాలను సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతున్న బొమ్మిడిపాటి శ్రీవల్లి రష్మికను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం రాష్ట్రానికి గర్వకారణం అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమురయ్య మాట్లాడుతూ శ్రీవల్లి రష్మిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం విద్యార్థిని కావడం గర్వంగా ఉందన్నారు. తమ స్కూల్ తరఫున ఆమెకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నామని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.