అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

పల్లవి, వరంగల్: జీవితంలో ఉన్నత స్థాయిగా ఎదగాలంటే విద్య ముఖ్యమని, విద్య అందరికీ అందాలని, సమాన అవకాశాలు దేశ ప్రజలకు అందేలా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య అన్నారు. వరంగల్ లో బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యున్నత కంపెనీల్లో ఉన్నత స్థాయిలో మన దేశ విద్యార్థులే ఉన్నారని, అది అంబేద్కర్ అందించిన స్ఫూర్తి అని అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయుడని కొనియాడారు. రాజ్యాంగం రచించేప్పుడు తాను పడిన కష్టాలు భవిష్యత్తులో దేశ ప్రజలు ఎవరూ అనుభవించకూడదని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా రాజ్యాంగం రచించారని, ఇప్పుడు దేశ ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమ ఫలితాలు అన్నీ అంబేడ్కర్ చలువ అనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానించిందని, అదే పార్టీ నేడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేయడాన్ని గుర్తించాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఎదిగిన ప్రధాని మోదీ.. దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారన్నారు. అప్పట్లో భారతదేశం అంటే పేద దేశం, చదువురాని దేశం అని అనేవారని, ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల అధినేతలు భారతదేశానికి చెందిన వారే అని అది గర్వంగా ఉందని మల్కా కొమరయ్య అన్నారు. భారతదేశ విశ్వగురు స్థానానికి చేరాలంటే టీచర్లది కూడా ముఖ్య భూమిక అని, విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలంటే ఉపాధ్యాయులే కీలకంగా మారి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. తాను విద్యార్థి దశలో వ్యవసాయం చేసుకుంటూ చదువుకున్నానని కనీసం కరెంటు సౌకర్యం కూడా ఉండేది కాదని, దీపం కింద చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని, తాను పడ్డ కష్టాలు ఇతరులు పడవద్దని1994 లో మొదటిసారిగా స్కూల్ ప్రారంభించినట్లు గుర్తు చేసుకున్నారు. తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేశారని అయినా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం తపస్, బీజేపీ తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహించారని తన గెలుపునకు కృషిచేసిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మత గ్రంథం కంటే రాజ్యాంగం గొప్పది: విజయ రామారావు
జయంతి కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని రాజ్యాంగాన్ని చదివిన వారే నాయకుడిగా ఉండాలని ఆయన సూచించారు. యువకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగాలని, అన్ని మత గ్రంథాల కంటే రాజ్యాంగం గొప్పదని అన్నారు. ఎమ్మెల్సీ కొమరయ్య పట్టుదల కార్య దక్షత కలిగిన వ్యక్తి, అనేక రంగాల్లో క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని నేటి యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వారికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యను ఆయన కోరారు. వరంగల్ లో సభ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ దళితులను అవమానించిందని, దళిత సీఎం, దళితులకు రెండు ఎకరాలు భూమి ఇతర వాగ్దానాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ పార్టీ .. ఆయన పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు ఢిల్లీలో జరపకుండా ముంబైకి పంపించి విమాన ఖర్చులు కూడా వసూలు చేసిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విజయ రామారావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రభాకర్, వర్ధన్నపేట అధ్యక్షురాలు వనిత, శంకర్, మాదాసు రాజు, వర్ధన్నపేట నర్సంపేట, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.