విద్యకు బడ్జెట్ లో నిధులు పెంచేలా సర్కారును ఆదేశించండి: MLC మల్క కొమరయ్య
విద్యకు బడ్జెట్ లో నిధులు పెంచేలా సర్కారును ఆదేశించండి: MLC కొమరయ్య

- గవర్నర్ ను కలిసి కోరిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
- టీచర్ల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
పల్లవి, హైదరాబాద్: కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత రావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ తో కలిసి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్ కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, టీచర్ల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కోఠారి కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ –2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రకారం ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, మెరుగైన ఫిట్ మెంట్ తో పీఆర్సీ, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్, పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు, బిల్లులను ప్రభుత్వం వెంటనే క్లియర్ చేసేలా ఆదేశించాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు, హెల్త్ కార్డులు, పదోన్నతులు అందేలా చూడాలని విన్నవించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరిగేలా చూడాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసేలా సర్కారును ఆదేశించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు తపస్ రాష్ట్ర బాధ్యులు గవర్నర్ ను కలిశారు.