టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతా: మల్క కొమరయ్య
టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతా: మల్క కొమరయ్య

- రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
- బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
- ఎమ్మెల్సీగా మండలిలో ప్రమాణ స్వీకారం
పల్లవి, హైదరాబాద్: ఎమ్మెల్సీగా టీచర్ల, విద్యారంగ సమస్యల కోసం పోరాటం చేస్తానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం మండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి మల్క కొమరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మల్క కొమరయ్య మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్), మద్దతు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలకు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమస్యలపై, టీచర్లకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లుల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. ‘‘తెలంగాణలో ఉన్న మేధావులు అందరూ కలిసి ఆలోచించి.. రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే పాలన బాగుంటుందని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ఎన్నికలు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇక నుంచి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు సహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం ఈసారి బీజేపీదే. ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎలా ముందుకు వెళ్తున్నదో అలాగే తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ప్రజల తీర్పు కచ్చితంగా ఈ దిశగా ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, మేధావులకు ప్రత్యేక కృతజ్ఞతలు”అని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఏవీన్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.