పత్తిరైతుకు అండగా మోదీ: కిషన్ రెడ్డి
పత్తిరైతుకు అండగా మోదీ: కిషన్ రెడ్డి

● మద్దతు ధరకే పెద్దమొత్తంలో పత్తిసేకరణ
● 2024-25 సంవత్సరంలో CCI ద్వారా రూ.15,556 కోట్ల పత్తి సేకరణ
● పత్తి మార్కెట్ ధర తగ్గిన ప్రతిసారీ మద్దతు ధరతో ఆదుకుంటున్న మోదీ
● ప్రధానమంత్రికి ధన్యవాదములు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పల్లవి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. బహిరంగ మార్కెట్లో పత్తికి సరైన ధరలు లభించని సందర్భంలో (2024-25) కనీస మద్దతు ధరలకే పెద్దమొత్తంలో తెలంగాణలో పత్తిని సేకరించి.. మరోసారి రైతుల పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి మేలు జరిగిందో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో 110 పత్తి సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసి 210 లక్షల క్వింటాళ్ల పత్తిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. దీని ద్వారా 9 లక్షలకు పైగా తెలంగాణ పత్తిరైతులకు లాభం జరగడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. దేశంలోనే పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 2014-15 పంట కాలం నుంచి 2024-25 పంట కాలం వరకు CCI ద్వారా రూ. 58 వేల కోట్లకు పైగా విలువైన పత్తిని నరేంద్రమోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరించింది. తద్వారా లక్షలాదిమంది రైతులకు అండగా నిలిచింది. ఇందులో ఒక్క 2024-25 పంట కాలంలోనే (17.03.2025 వరకు) రూ.15,556 కోట్ల విలువైన 210.19 లక్షల క్వింటాళ్ల కపాలను(పత్తిని) CCI సేకరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా దాదాపు 9 లక్షల మంది తెలంగాణ పత్తి రైతులకు ఈ సంవత్సరం లబ్ధి చేకూరింది. 2014-15 లో రూ. 3,750 గా క్వింటాలు పత్తి కనీస మద్దతు ధర 2024-25 నాటికి రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 7,121 కి చేరింది. ఇది పత్తిరైతులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన భరోసా. బహిరంగ మార్కెట్ లో పత్తి ధరలు తక్కువగా ఉన్న ప్రస్తుత సమయంలో మోదీ సర్కారు.. తెలంగాణ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పెద్దమొత్తంలో పత్తిని సేకరించి రైతులకు అండగా నిలిచింది.’’అని గుర్తు చేశారు.
కనీస మద్దతు ధర..
భూసార పరీక్షలు మొదలుకొని విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, పంట రుణాలు, పంట బీమా, నీటిపారుదల సౌకర్యాలు, గిడ్డంగుల నిర్మాణం, కనీస మద్దతు ధరకే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వరకు వ్యవసాయ రంగంలో అవసరమైన ప్రతి చోటా నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతి నిత్యం రైతులకు పూర్తిగా అండగా ఉంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చు & ధరల కమిషన్ సూచనల మేరకు పత్తితో సహా 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. పంట ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండేలా ఆయా పంటల కనీస మద్దతు ధరల నిర్ణయం జరుగుతుంది. పత్తి పంట విషయానికి వస్తే, బహిరంగ మార్కెట్ లో పత్తి పంట ధర కనీస మద్దతు ధర కంటే తగ్గిపోయిన ప్రతిసారీ రైతులకు అండగా నిలవడం కోసం భారత ప్రభుత్వం సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తి పంటను సేకరిస్తోంది. కనీస మద్దతు ధరల లబ్ధిని తెలంగాణ రైతులకు అందించటం కోసం 2024-25 పంట కాలానికి సంబంధించి సీసీఐ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 110 పత్తి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. అంకితభావంతో రైతులకు అండగా నిలబడింది’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.