కేంద్రమంత్రికి కిషన్ రెడ్డి పరామర్శ
కేంద్రమంత్రికి కిషన్ రెడ్డి పరామర్శ

పల్లవి, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం భువనేశ్వర్ లోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పరామర్శించారు. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి, మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ పరమపదించారు. ఈ మేరకు శనివారం, భువనేశ్వర్ లోని ప్రధాన్ నివాసంలో వారి తండ్రి చిత్రపటం వద్ద కిషన్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రధాన్ తోపాటు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘భారతీయ యువ మోర్చాలో పనిచేస్తున్న సమయంలో దేవేంద్ర ప్రధాన్ వంటి గొప్ప నేతతో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. పార్టీ జాతీయ స్థాయి కార్యక్రమాల్లో వారిని నేరుగా కలిసే అవకాశం వచ్చేది. ఈ సందర్భాల్లో వారి నుంచి చాలా అంశాలను నేర్చునున్నాను. వారు గొప్ప మానవతావాది, సహృదయ నేత. కార్యకర్తలను మరీముఖ్యంగా యువ నాయకులను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన దేవేంద్ర ప్రధాన్.. రాజకీయాల్లోనూ అంతే హుందాగా వ్యవహరించారు. అటల్ బిహారీ వాజపేయి కార్యక్రమాల్లో, ఎల్ కే అద్వాణీ యాత్రల్లో దేవేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించేవారు. వివిధ కార్యక్రమాల్లో వారితోపాటు పాల్గొన్నందునే వారితో నాకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అలాంటి గొప్ప వ్యక్తి మన నుంచి దూరం కావడం బాధాకరం. ఆయన కుమారుడు ధర్మేంద్ర ప్రదాన్, నేను కేంద్ర మంత్రి వర్గంలో పనిచేస్తున్నాం. గతంలో మేమిద్దరం బీజేవైఎంలోనూ కలిసి పనిచేశాం. తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ బీజేపీ తరఫున దేవేంద్రప్రధాన్ కు వినమ్ర శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”అని పేర్కొన్నారు.