ధోని రిటైర్మెంట్ అప్పుడే
ఐపీఎల్ 17వ సీజన్ లో ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన కీలక మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా చెన్నై ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేదు. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు షురూ అయ్యాయి. బెంగుళూరుతో జరిగిన మ్యాచే ధోనీకి చివరి మ్యాచ్ అని మళ్లీ మైదానంలో ధోనీని చూడలేమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో వార్త బయటకు వచ్చింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోని దానికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడని చెన్నై టీమ్ వర్గాలు చెబుతున్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ధోనీ తన రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది.
ఐపీఎల్ సమయంలో ధోనీ కండర గాయంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ గాయానికి శస్త్ర చికిత్స కోసం అతను లండన్ వెళ్లే ఛాన్స్ ఉంది. ధోనీ పూర్తి స్థాయిలో ఫిట్ గా లేడు. కానీ క్రికెట్ ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడు. శస్త్ర చికిత్స తర్వాతే అతను తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు. చికిత్స తీసుకుని కోలుకునేందుకు 5 నుంచి 6 నెలల పడుతుందని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే ధోనీ గాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. జట్టు రెండో వికెట్ కీపర్ అయిన డేవిడ్ కాన్వే కూడా గాయంబారిన పడటంతో తప్పనిపరిస్థితుల్లో ధోనీనే బాధను ఓర్చుకుని మైదానంలోకి దిగాల్సి వచ్చింది. ఓ పక్క గాయానికి మందులు వాడుతూనే వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆడాడు. డాక్టర్లు మహీకి విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ధోనీనే నిలబడాల్సి వచ్చింది. గత ఐపీఎల్లో కెప్టెన్ కూల్ మోకాలి గాయంతోనే ఆడాడు. జట్టుకు కప్పు అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ గాయం పూర్తిగా నయం అయ్యింది. కానీ కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంది.



