Pahalgam terror attack:హైబ్రిడ్ మిలిటెన్సీ వ్యూహం
Pahalgam terror attack:హైబ్రిడ్ మిలిటెన్సీ వ్యూహం

పల్లవి, వెబ్‌డెస్క్: పహల్గామ్లో టెర్రర్ అటాక్ యావత్తు దేశాన్ని కలచివేసింది. 27 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు.. 20 మందికి పైగా మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ మారణకాండకు తామే కారణమని లష్కరే తోయిబా జిహాది ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. హిందువుల ఊచకోత, నరమేధమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ చరిత్ర చూస్తే.. ఎన్నో కిరాతకాలు కనిపిస్తాయి.
- లష్కరే తోయిబా జిహాది ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 అక్టోబర్‌లో ఉనికిలోకి వచ్చింది. TRF తమను తాము జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న స్వదేశీ కాశ్మీరీ ప్రతిఘటన ఉద్యమంగా చెప్పుకుంటుంది.
- జమ్మూ కాశ్మీర్ లో మైనారిటీలుగా ఉన్న కాశ్మీరీ పండితులు, హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రవాద సంస్థ దాడులు చేస్తోంది. భద్రతా దళాలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారస్తులు, స్థానిక రాజకీయ నాయకులు, పర్యాటకులతో సహా అనేక మంది పౌరులపై అత్యంత పాశవిక దాడులకు పాల్పడి.. అది తమ పనేనని ప్రకటిస్తుంటుంది.
- ఈ ఉగ్ర సంస్థ ఆన్లైన్ మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియమించుకుంటుంది. ఉగ్రవాద కార్యకలాపాలు, నియామకాలు, చొరబాట్లు, పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడటం ఈ ఉగ్రసంస్థకు అలవాటు. TRF సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి, యువతను ఆకర్షించడానికి వీడియోలు, పోస్టర్లను విడుదల చేస్తుంటుంది.
- TRF ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు అనేక దాడులకు పాల్పడింది. 2020లో కెరాన్, హంద్వారాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ సంస్థ పాల్గొంది. 2021లో సోపోర్‌లో బీజేపీ కౌన్సిలర్ల సమావేశంపై దాడి చేసింది. 2022లో షాపియాన్లో ఐఈడీ దాడికి పాల్పడింది. 2023లో అనంత్‌నాగ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొంది. 2024లో రియాసీలో జరిగిన దాడికి బాధ్యత వహించింది. ఇప్పుడు పహల్గామ్లో పర్యాటకులపై అత్యంత పాశవికంగా దాడి చేసి.. 27 మందిని బలిగొంది.
- జాతీయ భద్రత, భారతదేశ సార్వభౌమాధికారానికి TRF కార్యకలాపాలు హాని కలిగిస్తున్నాయని,ఈ సంస్థ పాకిస్తాన్ నుంచి మద్దతు పొందుతూ లష్కరే తోయిబా ముసుగు సంస్థగా పనిచేస్తోందని భారత ప్రభుత్వం గుర్తించింది.
- 2023 జనవరిలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద TRFని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ ఉగ్రసంస్థకు నాయకుడిగా ఉన్న షేక్ సజ్జాద్ గుల్‌ను కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
- TRF ఉగ్రవాద సంస్థ నాయకుడు షేక్ సజ్జాద్ గుల్ అత్యంత క్రూరుడు. 1974లో శ్రీనగర్‌లోని నవా బజార్లో పుట్టిన వీడు.. లష్కరే తోయిబా కమాండర్లలో ఒకడు. 2017లో ఫేక్ అడ్రస్ తో పాస్‌పోర్ట్ పొంది పాకిస్తాన్‌కు వెళ్ళాడు.
- 2018లో జరిగిన ప్రముఖ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్య కేసులో షేక్ సజ్జాద్ గుల్ ప్రధాన కుట్రదారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వీడిని పట్టించిన వారికి ₹10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.
- TRF ఉగ్రసంస్థ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. ఉదాహరణకు 2022లో జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు 172 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. అందులో108 మంది TRFకి చెందినవారే ఉన్నారు. అయితే అదే ఏడాది TRF కొత్తగా 74 నుంచి100 మంది ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంది.
- హైTRF ఉగ్రసంస్థ దాడి తీరును గమనిస్తే.. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది ఉగ్రవాదులు… ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. అంటే వీరు స్థానికులుగా ఉండి, నేరుగా ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేనట్లుగా సాధారణ ప్రజలుగా ఉంటారు. దీని వల్ల భద్రతా దళాలకు వీరిని గుర్తించడం కష్టమవుతుంది. ఏదైనా దాడి చేసిన తర్వాత వీరు వెంటనే సాధారణ ప్రజల్లో కలిసిపోతారు. ఈ విధానాన్ని “హైబ్రిడ్ మిలిటెన్సీ” అంటారు.