దొంగలు మళ్ల మోపైన్రు.. వినాయకుడి లడ్డూ గోవిందా.. గోవింద!
వినాయక చవితి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గణేశుడి ఉత్సవాల్లో లడ్డూకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
వినాయక చవితి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గణేశుడి ఉత్సవాల్లో లడ్డూకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గణేషుడితో పాటు.. ఆయన చేతిలో ఉండే ఈ లడ్డూకు కూడా నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. ఈ లడ్డూను నవరాత్రుల చివరి రోజు వేలం వేస్తారు. దీనిని కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
బాచుపల్లి పరిధి ప్రగతి నగర్లోని ఓ అపార్ట్మెంట్లో గణేషుడిని ప్రతిష్టించారు. పూజ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు లంబోదరుడి చేతిలో భారీ లడ్డూను పెట్టారు.అనంతరం అందరూ నిద్రపోగా.. రాత్రి 1 గంట సమయంలో మండపంలో ఎవరూ లేనిది చూసి అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ.. మండపంలోకి వచ్చి గణేషుడి చేతిలో ఉన్న లడ్డూను దర్జాగా ఎత్తుకెళ్లిపోయాడు.
పొద్దున లేచి చూసేసరికి వినాయకుడి చేతిలో లడ్డూ లేకపోవడంతో నిర్వహకులు షాకయ్యారు. సీసీ కెమెరాల్లో చూడగా.. లడ్డూ చోరీకి గురైందన్న విషయం బయటపడింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వినాయక చవితి నవరాత్రి వేడుకల్లో ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి.



