మతం రంగు పూసి తప్పుడు ప్రచారం – డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లోని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించడానికి హైడ్రా అనే స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. హైడ్రా కమీషనర్ గా ఏవీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. హైడ్రా ఏర్పాటు చేసిన మొదట్లో నగరంలోని ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఇండ్లను, భవనాలను కూల్చి వేసింది.
ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇండ్లను, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ కు చెందిన ఫాతిమా కాలేజీను కూల్చివేయలేదు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అయిన అసదుద్ధీన్ ఓవైసీ కు చెందిన ఈ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కానీ హైడ్రా టచ్ కూడా చేయలేదు. అప్పట్లో సర్వత్రా విమర్శలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు దీనిపై క్లారిటీచ్చారు.
ఆ ఇంటర్వూలో ఉప ముఖ్యమంత్రి భట్టీ మాత్లాడుతూ ” ఓవైసీ కు చెందిన ఫాతీమా కాలేజీ గురించి కొంతమంది కావాలనే మతం రంగు పూసి తప్పుడు ప్రచారం చేస్తున్నరు. పేదలకు మంచి జరిగితే చూసి చూడనట్లు వదిలేయాలి. మానవీయ కోణంలోనే ఆ కాలేజీని కూల్చలేదు ” అని ఆయన స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఇండ్లను కోల్పోయిన బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఆదుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.