ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ప్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రాబోయే రెండు మూడేండ్లలో ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం రావడం ఖాయం. రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగు చేరుకుంటుందని” ఆయన తెలిపారు.
మంత్రి తుమ్మల ఇంకా మాట్లాడుతూ ” అత్యాధునీక యంత్రాలతో దేశంలోనే మొదటిసారి నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ప్యాక్టరీని ఏర్పాటు చేశాము. త్వరలోనే ఆ ప్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. లక్ష మంది ఆయిల్ ఫామ్ రైతులతో అరోజు సభను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడూ నిధులు విడుదల చేయగా జిల్లా ఆయిల్ ఫెడ్ అధికారులు ప్యాక్టరీ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేశారు అని మంత్రి తుమ్మల అధికారులను అభినందించారు.
వంటనూనె కోసం విదేశాలకు ప్రతి ఏడాది లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఇక్కడ నుంచే విదేశాలకు పంపే స్థాయికి తెలంగాణ ఎదుగుతుంది. రైతులు ఆవిధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో మొత్తం పదమూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుంటే ఏపీ, తెలంగాణలోనే పది లక్షల ఎకరాల్లో ఆ పంట సాగు అవుతుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తు చేశారు.