స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత రెండేండ్లుగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు భట్టీ విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక తో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సాధ్య అసాధ్యాలపై సుధీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల ముప్పై తారీఖు లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు విధించిన గడువు మరో పదిరోజుల్లో ముగియనున్నది. ఆలోపు బీసీల రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ రాకపోవడంతో ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనేది మంత్రుల అభిప్రాయం అడిగినట్లు సమాచారం.
హైకోర్టును మరింత సమయం అడిగాలని లేదా ఒకవేళ హైకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వమే ఓ ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచన ఎలా ఉంటుందనేది కూడా చర్చించారు .జీవో పై ఎవరైన కోర్టుకెళ్తే పార్టీ పరంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా తెలిపినట్లు సమాచారం.