గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం ఖైరతాబాద్ లోని గణేషుడ్ని దర్శించుకున్నారు. మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోని అన్ని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. ప్రజలు చాలా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. మత సామరస్యానికి హైదరాబాద్ ప్రతీక అని తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” ‘ఖైరతాబాద్ లో 71 ఏళ్ల క్రితం ఒకే ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతిష్టించింది. ఆనాడు ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ఈ నాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు అని అన్నారు. ఇప్పటివరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను నిర్వహించుకున్నాము. రేపు జరగనున్న మహా గణపతి నిమజ్జనానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు తెలంగాణకి మంచి పేరు తెచ్చి పెట్టాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.