గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణ కేంద్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలంలో అమ్రీన్ అనే ముస్లిం మహిళ పాల్గొన్నారు. ఈ వేలంలో ఆ లడ్డూను రూ.1,88,888లకు అమ్రీన్ దక్కించుకున్నారు.
హిందూ పండుగలో ముస్లిం మహిళ భాగస్వామి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమ్రీన్ మాట్లాడుతూ గణపతి లడ్డూను వేలంలో దక్కించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు నారాయణపేట జిల్లా ముష్టిపల్లిలో జరిగిన గణపతి లడ్డూ వేలంలో ఎండీ పాషా అనే ముస్లిం వ్యక్తి రూ.26,116లకు ఆ లడ్డూను సొంతం చేసుకున్నారు.



