మీకు హెలికాప్టర్లు,మాకు బురద రోడ్లా?- బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం మాని,బయటకొచ్చి ప్రజల పరిస్థితులు చూడాలని,వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న తుంగమడుగు గ్రామానికి ఇప్పటికీ రోడ్డు లేదని,ప్రజలు,మహిళలు,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు,పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగా లేకపోవడంతో అంబులెన్స్ కూడా రావడం లేదని,గత పాలకులు కొబ్బరి కాయలు కొట్టి,శంకుస్థాపన చేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా గెలిచిన తర్వాత అద్దం లాంటి రోడ్లు వేయిస్తానని చెప్పి,అపుడు గ్రామంలో అడుగు కూడా పెట్టడం లేదన్నారు.ఎమ్మెల్యేకు ఎందుకు సోయి లేదని ప్రశ్నించారు.
కేవలం హైదరాబాద్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీకి 40 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వాడుతున్న రోడ్లు భవనాల శాఖ మంత్రికి, ప్రజల నివసించే గ్రామాల్లో రోడ్లు వేయించాలని తెలియదా? మీకు హెలికాప్టర్లు పేదలకు బురద రోడ్లా? ఇదేనా మీ ప్రజా పాలన అంటూ ధ్వజమెత్తారు.సాయంత్రం ప్రజలు గ్రామానికి నడిచి వెళ్లే క్రమంలో ఆకతాయిలు రోడ్డు పైనే మద్యం సేవిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని,పోలీసులు పెట్రోలింగ్ ఎందుకు చేయడంలేదని నిలదీశారు. గతంలో గ్రామంలో దొంగతనం కేసులు కూడా నమోదయ్యాయని,అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైం రేటు పెరిగిందని గుర్తు చేశారు. తుంగమడుగు గ్రామంలో కూడా దిశ,సమత వంటి ఘటనలు జరగవని హోం మంత్రి గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పోలీసులు ఆకతాయిలపై చర్యలు తీసుకోవడం లేదు కానీ, రోడ్డు కావాలని ధర్నా చేస్తే 30 యాక్ట్ అమలులో ఉంది,కేసులు పెడతామని ప్రజలను బెదిరించడం దారుణమన్నారు.
రోజూ యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పే రేవంత్ రెడ్డి ఒక్క రోజైనా ఒక్క పాఠశాలనైనా సందర్శించారా అని అడిగారు. తుంగమడుగు గ్రామంలోని ఏకోపాధ్యాయ పాఠశాలను సందర్శించారు. పిల్లలతో మాట్లాడారు. 3వ తరగతి చదివే పిల్లలు ఒకటో తరగతి పుస్తకం కూడా చదవకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదని,పాఠశాల ప్రాంగణంలో దుర్గంధం,ఎలాంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే ఈ స్కూలును సందర్శించాలని డిమాండ్ చేశారు.ఈ గ్రామంలో అంగన్ వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.వీధి లైట్లు ఏర్పాటు చేసి,రైతులకు ఉచితంగా మూడు ఫేస్ ల కరెంట్ అందించాలని,గ్రామస్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.15 రోజుల్లో గ్రామానికి రోడ్డు వేయకపోతే రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పేదల ఇళ్లను పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు రాకపోవడంపై,అసహనం వ్యక్తం చేస్తూ,కాంగ్రెస్ పార్టీ అంటేనే కమీషన్ల పార్టీ అని స్పష్టం చేశారు.కార్యక్రమంలో తుంగమడుగు గ్రామస్థులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర