భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూ.30.01 లక్షలు పలికింది. కానీ ఈసారి ఏకంగా రూ.35 లక్షలతో రికార్డులు బద్దలు కొట్టింది. కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దాన్ని దక్కించుకున్నారు.బాలాపూర్ లో 1994లో తొలిసారి లడ్డూ వేలం వేశారు. రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.లక్షలకు చేరుకుంది. ఈసారి 38 మంది వేలం పాటలో పాల్గొన్నారు.బంగారు లడ్డూగా పేరుగాంచిన బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
తొలి వేలం 1994లో ₹450తో మొదలైంది.. 2000లో లడ్డూ ధర ₹66,000 కి చేరింది. 2010లో ₹5.35 లక్షలు, 2017లో ₹15.6లక్షలు, 2021లో ₹18.9లక్షలు పలికింది. 2023లో ₹27లక్షలు, 2024లో రికార్డు స్థాయిలో 30లక్షలు దాటింది.
బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తారు. ఇప్పటివరకు రూ.కోటికి పైగా అభివృద్ధి కోసం వెచ్చించారు. గ్రామంలో స్కూల్, రోడ్లు, ఆలయాలు నిర్మించారు. దీంతో ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.



