ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2021లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ సరికాదంది హైకోర్టు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదన్న హైకోర్టు.. ఇప్పుడెలా హైడ్రాను పార్టీగా చేస్తామంది. హైకోర్టు ఆదేశాలకుముందు.. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా చుట్టూ ఇనుప కంచెలను కూడా పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు తాజా తీర్పుతో ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించునున్నారు.



