సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం రేవంత్ రెడ్డిపై నమోదైన ఒక కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు వివరాల్లోకి వెళితే 2021లో ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, తనపై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కింది కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది.