రేవంత్ కి ఒక న్యాయం…? దిందా రైతులకు ఇంకో న్యాయమా?- ఆర్ఎస్పీ ప్రవీణ్

పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పాలనలో అటవీ అధికారుల ఆగడాలు,దౌర్జన్యాలు ఆపాలని,పోడు వ్యవసాయం చేసుకోవడానికి అనుమతించాలని దిందా గ్రామ పోడు రైతులు 400 కిలోమీటర్లు కాలినడకన హైదరాబాద్ వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి,మహిళలని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తే ఎలా అరెస్ట్ చేస్తారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అరెస్ట్ అయిన తర్వాత కార్యకర్తలతో కలిసి కౌటాల కేంద్రంలోని కొమురంభీమ్ విగ్రహం వద్దకు ర్యాలీగా వచ్చి రైతులనుద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,అరెస్టులతో పోరాటాన్ని ఆపాలని చూస్తే రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు పోడు భూముల సమస్యను పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.కంచ గచ్చిబౌలిలో వంద ఎకరాల భూమిని రాత్రికి రాత్రే నాశనం చూస్తే రేవంత్ రెడ్డి పై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, పోడు రైతులకు ఇంకో న్యాయమా? అంటూ ప్రశ్నించారు.అటవీ అధికారులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టారని అడిగారు. గతంలో లగచర్ల రైతులపై కేసులు పెట్టారని,కుందారం రైతులపై కేసులు పెట్టారని,ఇపుడు దిందా రైతులపై కేసులు పెడుతున్నారని,కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టం చేశారు.
ఒకపక్క సామాజిక న్యాయం,బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే,మరో పక్క బిసి రైతులను అరెస్టు చేస్తుందన్నారు.
ఫోర్త్ సిటీ పేరుతో భూములు కబ్జా చేస్తున్నారని,మరోపక్క కోడిగుడ్ల కుంభకోణం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.స్థానిక బిజెపి ఎమ్మెల్యే ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదని,కేంద్ర అటవీశాఖ మంత్రికి,మోడీ,అమిత్ షా లకు చెప్పి ఎందుకు న్యాయం చేయడం లేదన్నారు. అందుకే చేతకాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వెంటనే దిందా గ్రామం నుండి అటవీ అధికారుల క్యాంపులు తొలగించాలని డిమాండ్ చేశారు.400 కుటుంబాలు,మనుషుల ప్రాణాల కంటే కేవలం 7 పులుల సంక్షేమమే ముఖ్యమా అంటూ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఫారెస్టు అధికారుల ఆగడాలను అపకపోతే,రైతులందరి సమస్యలు పరిష్కరించక పోతే దిందా ప్రజలందరితో కలిసి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరం పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. దిందా రైతులను వారి భూముల్లో విత్తనాలు పెట్టుకునేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లెండుగురె శ్యాంరావు,అర్షద్ హుస్సేన్,బండు పటేల్,విశ్వనాథ్,దాసరి ఉష,వరలక్ష్మి,కార్తీక్,సాయి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర