శాంతించిన గోదావరి.. భద్రాచలం వద్ద తగ్గిన నీటి మట్టం
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానల కారణంగా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం నీటిమట్టం 53.8 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు 52.2 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను విరమించారు.
ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. 48 అడుగుల కంటే తగ్గితే దాన్ని కూడా వెనక్కి తీసుకుంటారు. భద్రాచలం గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఇప్పటికీ ప్రవాహం ఉధృతంగానే ఉంది. అక్కడికి ఎవరినీ రానీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, కూనవరం వెళ్లే వెళ్లే మార్గంలో పలుచోట్ల వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.



