భారీ వర్షాలతో పంచాయితీ రాజ్ రహదారుల్లో రూ.374 కోట్ల నష్టం- మంత్రి సీతక్క

పల్లవి, వెబ్ డెస్క్ : గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతిన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ENC ఎన్. అశోక్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దెబ్బతిన్న రహదారుల వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 1291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రికి నివేదించారు. వీటి తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మత్తుల కోసం రూ. 352 కోట్లు, మొత్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.374.71 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు.మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా.. వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్ల, మిగిలిన గ్రామాలకు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు ENC ఎన్. అశోక్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలనీ సూచించారు. వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని..పంచాయతీరాజ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగంగా చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.