కిడ్నాపైన ఆర్మీ జవాన్ మృతి.. డెడ్ బాడీపై తుపాకీ గాయాలు
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఇద్దరు జవాన్లను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాపైన ఇద్దరిలో టెరిటోరియల్ ఆర్మీ జవాన్ మృతదేహం లభ్యమైంది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఇద్దరు జవాన్లను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాపైన ఇద్దరిలో టెరిటోరియల్ ఆర్మీ జవాన్ మృతదేహం లభ్యమైంది. అతని మృతదేహంపై తుపాకీ గాయాలు అయినట్లుగా గుర్తించారు. మృతి చెందిన జవాన్‌ను అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. అధికారులు హిలాల్ అహ్మద్ భట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భట్ మృతదేహాన్ని వైద్య లాంఛనాల కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
అక్టోబర్ 8న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన జాయింట్ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 161 యూనిట్‌కు చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్‌లోని అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్ చేయబడ్డారు. కానీ ఇందులో ఒకరు తప్పించుకున్నారు. గాయపడిన మరో సైనికుడిని అవసరమైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.



