వారెవ్వా : పంబన్ బ్రిడ్జ్ అదరహో .. ఇదొక అధ్బుతం: మంత్రి అశ్వినీ వైష్ణవ్
తమిళనాడు సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిధిలావస్ధకు చేరడంతో దాని స్ధానంలో మరో కొత్త పంబన్ బ్రిడ్జిని అదే పేరుతో తాజాగా నిర్మించారు
తమిళనాడు సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిధిలావస్ధకు చేరడంతో దాని స్ధానంలో మరో కొత్త పంబన్ బ్రిడ్జిని అదే పేరుతో తాజాగా నిర్మించారు. ప్రారంభానికి సిద్దమవుతోన్న ఈ తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్.. తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీనిని సిద్ధం చేశారు. కొంగొత్త హంగులతో తయారైన నూతన పంబన్ బ్రిడ్జి.. పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంబంధిత ఫోటోల్ని రైల్వే మంత్రి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
కొత్త పంబన్ బ్రిడ్జి ఫోటోల్ని.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ఎక్స్ లో షేర్ చేశారు. దీన్ని ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. కొత్త పాంబన్ వంతెన కేవలం క్రియాత్మకమైనది కాదని.. ఇది ఆధునిక ఇంజినీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానించే పురోగతికి చిహ్నమని కొనియాడారు. వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్ లో నిర్మించిన తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం. దీని రాకతో 105 ఏళ్ల చరిత్ర కలిగిన పంబన్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోనున్నాయి. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన మధ్యలో భారీ ఓడలు వచ్చినప్పుడు తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు ఉంటాయి. గతంలో ఉన్న పంబన్ బ్రిడ్జికి కూడా ఈ ఫీచర్ ఉంది.
1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్ బ్రిడ్జ్‌ను ప్రభుత్వం నిర్మించింది’’ అంటూ మంత్రి రాసుకొచ్చారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు. స్పీడ్, సరికొత్త టెక్నాలజీలను కొత్త దానిలో ఉపయోగించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు.
రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం (పంబన్ ద్వీపం) మధ్య 1914లో పంబన్ బ్రిడ్జిని సముద్రంలో నిర్మించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. 2.06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్‌లు వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది. ఇప్పుడు అలాకాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.



