జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు

పల్లవి, వెబ్ డెస్క్ : కోవిడ్ సమయంలో నిలిపివేసిన జర్నలిస్ట్ పాసుల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని రైల్వేలు, సమాచార, ప్రసారం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జర్నలిస్టులకు రైల్వే పాసుల సౌకర్యం పునరుద్ధరించాలనే అంశంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు రైల్వేలు, సమాచార, ప్రసారం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
భారతీయ రైల్వేలు సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన సేవలను అందించడానికి కృషి చేస్తుందని, 2023-24 సంవత్సరంలో ప్రయాణికుల టిక్కెట్లపై రూ. 60,466 కోట్ల రాయితీ అందించామని, రైల్వేలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ సగటున 45 శాతం రాయితీకి సమానం అని, రూ.100 ఖర్చవుతున్న సేవను కేవలం రూ.55కే ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ రాయితీతో పాటు, 4 వర్గాల దివ్యాంగులకు, 11 వర్గాల రోగులకు, 8 వర్గాల విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు కొనసాగుతున్నాయని, జర్నలిస్టుల రైల్వే పాస్ సౌకర్యం నిలిపివేతపై పలు సంఘాలు, వ్యక్తుల నుంచి ప్రతిపాదనలు, విజ్ఞప్తులు రైల్వేలకు చేరుతున్నాయని, ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు రైల్వే పాస్ సౌకర్యం పునరుద్ధరించాలన్న డిమాండ్ న్యాయసమ్మతమైందని, జర్నలిస్టులు ప్రజలకు సమయానుకూలంగా, పారదర్శకంగా సమాచారం చేరవేయడంలో విశేష పాత్ర పోషిస్తున్నారని, ఈ అంశంపై తాను లోక్సభలో ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.