చాందిపుర వైరస్ కలకలం : నలుగురు చిన్నారులు మృతి.. ఎలా సోకుతుందంటే?
గుజరాత్ లో చాందిపుర వైరస్ కలకలం రేపుతుంది. ఈ వైరస్ లక్షణాలతో సబర్‌కాంతా జిల్లాలో నలుగురు చిన్నారులు చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చిన్నారులు జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి రక్తనమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు వైద్యులు పంపారు. వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని సబర్కాంత ముఖ్య జిల్లా ఆరోగ్య అధికారి రాజ్ సుతారియా తెలిపారు.
రాబ్డోవిరిడే జాతి దోమలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది సోకితే జ్వరం, ఫ్లూ, మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. 1965లో మహారాష్ట్రలోని చాందిపురలో ఈ వైరస్‌ను గుర్తించడంతో అదే పేరు పెట్టారు. . చాందిపుర వైరస్ వల్ల మృతిచెందిన వారిలో ఒకరు సబర్ కాంత్ జిల్లా వాసి కాగా, ఇద్దరు ఆరావలి జిల్లా వాసులున్నారు. నాలుగవ చిన్నారి మాత్రం రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇద్దరు కూడా రాజస్థానీయులే.



