మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు..కశ్మీర్ లో షాకింగ్
జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడుతున్నారు. అక్కడ వరుసగా ఎన్ కౌంటర్లు జరగడం కలవరం రేపుతోంది. బారాముల్లా జిల్లాలోని చక్ తపీర్ కీర్తి పఠాన్ ఏరియాలో శుక్రవారం రాత్రి అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా..ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఆపరేషన్ లో శనివారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది ఆర్మీ. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇక, శుక్రవారం కిష్తవార్ ఆపరేషన్ సమయంలో గాయాలపాలైన ఇద్దరు భారత సైనికులు మరణించారు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లోనే ఈ ఎన్కౌంటర్లు జరగడం గమనార్హం.
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం కశ్మీర్ లో అత్యంత సున్నితమైన ప్రాంతమైన దోడాలో బీజేపీ నిర్వహించే ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు. గత 42 ఏళ్లలో ఓ భారత ప్రధాని దోడాలో పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ ర్యాలీ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశలో భాగంగా పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు…సెప్టెంబర్ 25న రెండో దశలో గందర్బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లోని 26 స్థానాలకు… అక్టోబరు 1న చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లోని 40 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.



