ప్రజల చూపు..బీజేపీ వైపు : కిషన్ రెడ్డి
బీజేపీ ఆవిర్భవించినప్పుడు చాలా మంది అవహేళన చేశారని.. అధికారంలోకి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ దేశాన్ని, సంస్కృతిని కాపాడుకునేందుకు బీజేపీ పుట్టిందన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తూ ఎంతో మంది కార్యకర్తలు అమరులు అయ్యారని గుర్తు చేసుకున్నారు. రైల్వేస్టేషన్లో టీ అమ్ముకునే సాధారణ వ్యక్తి నేడు ప్రధాని అయి దేశ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ట్రిపుల్ తలాక్, చంద్రయాన్, ఆర్థిక సంస్కరణలు, దేశ రక్షణ, జాతీయ రహదారులు, రైల్వేలు, విదేశీ దౌత్యనీతి.. ఇలా అన్ని రంగాల్లో మోడీ దేశాన్ని ప్రపంచానికే ఆదర్శంగా నిలుపుతున్నారని కొనియాడారు.
గత పదకొండేళ్లుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఘనత మోడీకే దక్కుతుందని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి నిదర్శనమని చెప్పారు. అతితక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. అటువంటి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి ఊడిగం చేయడం కోసం పోటీపడుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు పార్లమెంట్ లోకి వస్తే మూడు పార్టీలు కూడగట్టుకొని వ్యతిరేకంగా ఓటు వేశాయన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్‌ను గెలిపించడం కోసం..బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు పోటీ చేయకుండా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను బద్దలు కొట్టి.. ఆ రెండు పార్టీల నిజస్వరూపం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరు అలుపెరగని కృషి చేయాలని పిలుపునిచ్చారు.



