మీరు గంట నిద్ర తక్కువ పోతున్నారా..?

పల్లవి, వెబ్ డెస్క్ : సహజంగా ప్రతి ఒక్కరూ రోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా ఎంతో ఉల్లసంగా ఉత్సాహాంగా పని చేసుకోవచ్చు. మెదడు, శరీరం అంతా సహాకరిస్తుందని వైద్యనిపుణులు చెబుతుంటారు.
అయితే, ప్రస్తుత బిజీ బిజీ షెడ్యూల్ వల్ల రోజూవారీ పని ఎక్కువైందనో, రాత్రి పూటనో, పండగపూటనో పార్టీ చేసుకోవాలనో, రేపు ఎలాగూ హాలిడేనే కదా అని నైట్ ఔట్ లు చేద్దామనో నిద్రను నిర్లక్ష్యం చేసి ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతే దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఓరోజు గంట నిద్ర తగ్గితే ఆ గంట నిద్రను భర్తీ చేయడానికి కనీసం 4 రోజులు పడుతుందట. ఆ ప్రభావం నిద్రపోని మనిషి యొక్క శరీరం, మెదడుపై పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ప్రశాంతత దెబ్బతింటాయి. ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగ్గిన నిద్రను భర్తీ చేస్తే గానీ మీ మెదడు పనితీరు మెరుగవ్వదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని వారు సూచిస్తున్నారు.