ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ ఇండి కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 452 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈరోజు శుక్రవారం ఆయన నూతన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్ ఖడ్, స్పీకర్ ఓం బిర్లా లతో పాటు పలువురు కేంద్రమంత్రులు హజరయ్యారు.1957లో తమిళనాడులో జన్మించిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పదహారు ఏండ్ల నుంచే ఆర్ఎస్ఎస్ , జన్ సంఘ్ లో పనిచేశారు.
1998, 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. 2004, 14, 19లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2004-07 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు.