మోతీలాల్ నిరాహార దీక్ష విరమణ

పల్లవి, హైదరాబాద్: నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ మంగళవారం విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘ గతంలో కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ, నేను దీక్ష చేస్తే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. నా ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయినా ఈ ప్రభుత్వంలో స్పందన కరువైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడిగాం. కానీ, మా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నా మనస్సు కలిచివేసింది. అందుకే నిరాహార దీక్ష చేశాను. తొమ్మిది రోజుల దీక్ష చేసినా రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమూ పెరగలేదు. అన్న పానీయాలు లేకుండా నిరవధిక దీక్ష చేశా. దీని వల్ల నా ఊపిరితిత్తులు, కిడ్నీలు పనిచేయని పరిస్థితికి వచ్చాయి.నా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో దీక్ష విరమిస్తున్నా’అని మోతీలాల్ తెలిపారు.
నిరసనలు కొనసాగిస్తాం:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని మోతీలాల్ మండిపడ్డారు. 25 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ‘కొత్త ప్రభుత్వం రాగానే డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. గ్రూప్-1లో 1:100 శాతం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలు పెంచాలి. డీఎస్సీ రద్దు చేసి మెగా డీఎస్సీ ప్రకటించాలి. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. బుధవారం నుంచి ప్రత్యక్ష పద్ధతిలో నిరసనలు కొనసాగిస్తాం. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ వెనక్కి తగ్గం’ అని మోతీలాల్ తెలిపారు.