సలామ్ పోలీస్.. ప్రాణాలకు తెగించి మరి కాపాడారు!
పల్లవి, నాగర్ కర్నూల్/మెదక్: వరద సహాయక చర్యల్లో పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి బాధితులను రక్షించారు. వాగులో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డిండి వాగులో చిక్కుకున్న జాలర్లను రెస్క్యూ బృందాలు రక్షించాయి. సోమవారం అచ్చంపేట మండలం సిద్ధాపూర్వద్ద డిండి వాడులో వీరు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారులు సహా 9 మందిని మంగళవారం తాళ్ల సాయంతో రక్షించారు. సహాయక చర్యలను ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలు నాయక్ పర్యవేక్షించారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులు, గ్రామ యువకులతో కలిసి టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిది గుండు వాగులో ప్రాణాలను పణంగా పెట్టి వరద నీటిలో కొట్టుకుపోతున్న రమావత్ నందు అనే వ్యక్తిని కాపాడారు. వాగులో ఓ బండ రాయిని పట్టుకొని ఆగిపోయిన నందును గమనించిన మెదక్ జిల్లా క్యూ ఆర్ టీ జిల్లా సభ్యుడు హోం గార్డ్ మహేష్, మరో ఇద్దరు యువకులు తాడు సాయంతో కల్వర్టు మధ్యలోకి చేరుకోగా, అందరూ ఒక జట్టుగా ఏర్పడి.. ఆ వ్యక్తిని వరద ప్రవాహం నుంచి కాపాడారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని, క్యూఆర్ టీ సభ్యులు బండి శ్రీనివాస్(హెడ్ కానిస్టేబుల్), సురేష్ నాయక్ (పోలీస్ కానిస్టేబుల్), కృష్ణ (పోలీస్ కానిస్టేబుల్), రమేష్ (పోలీస్ కానిస్టేబుల్), మహేష్ (హోమ్ గార్డ్) తదితరులను రాష్ట్ర డీజీపీ డా. జితేందర్, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ లు అభినందించారు.



