మద్యం మత్తులో సీఐ కొడుకు వీరంగం.. మూత్రం పోయొద్దన్నందుకు దాడి
పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోయవద్దని చెప్పినందుకు ఓ సీఐ కొడుకు వీరంగం సృష్టించాడు. తన మిత్రులతో కలిసి క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశాడు. మంగళవారం ఉదయం 4 గంటలకు కాజీపేట చౌరస్తాలో జరిగిన ఈ ఘటనపై బాధితులు కాజీపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
అసలు ఏం జరిగింది?
కాజీపేట చౌరస్తాలో బస్టాప్ పక్కన ఓ క్యాబ్ డ్రైవర్ బండిని పార్క్ చేసి ఉన్నాడు. అంతలో ఓ వెహికిల్ లో తన ఫ్రెండ్స్ తో వచ్చిన సీఐ కొడుకు.. ఆ పక్కనే మూత్రం పోసేందుకు వెళ్లాడు. ఇక్కడ మూత్రం పోస్తే ఎలా.. అని క్యాబ్ డ్రైవర్ వారితో అన్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సీఐ కొడుకు, అతని ఫ్రెండ్స్ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారు. దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్ లోకి డ్రైవర్ పరిగెత్తగా.. వెంటపడి మరీ కొట్టారు. చేతికి ఉన్న కడియంతో తలపై గుద్దడంతో డ్రైవర్ కు గాయమై రక్తస్రావం అయింది. తోటి డ్రైవర్లు108లో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా పక్కన నిలిపి ఉంచిన 3 కార్లపై బలంగా గుద్దడంతో అద్దాలు పగిలాయి.
పోలీసులతో వాగ్వాదం..
సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించగా.. వారితోనూ వాగ్వాదం దిగినట్లు సమాచారం. ‘‘నా తండ్రి సిద్దిపేటలో సీఐ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ డ్రైవర్ లను బూతులు తిట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సీఐ కొడుకుతో పాటు దాడిలో మరో 6 గురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు సమాచారం.



