ఢిల్లీలోనే హరీష్, కేటీఆర్.. ఎందుకంటే!

పల్లవి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవితతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ములాఖత్ అయ్యారు. సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ రావులు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉందని సమాచారం. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉండి.. న్యాయవాదుల బృందంతో కేటీఆర్, హరీష్ రావులు సమన్వయం చేయనున్నారని టాక్. హైకోర్టు ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఆమెతో మాట్లాడిన ఇద్దరు నేతలు ధైర్యంగా ఉండాలని సూచించారు.