జూబ్లీహిల్స్ టిక్కెట్ నాకే – కాంగ్రెస్ ఎంపీ

పల్లవి, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో అకాల మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతనే కన్ఫార్మ్ అని తెలంగాణ భవన్ లో టాక్.
ఆ టాక్ కు తగ్గట్లే మాగంటి సునీత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వచ్చాక జరగబోయే తొలి ఉప ఎన్నిక కాబట్టి ఎలాగైనా గెలవాలనే ఆరాటంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు తగ్గట్లుగానే మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ తదితరులు నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు సంక్షేమాభివృద్ధి పథకాలకు స్వీకారం చుడుతున్నారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు తనకే అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా రెండు సార్లు గెలుపొందాను. పదేండ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను అండగా ఉన్నాను. నేను గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలని” ఆయన డిమాండ్ చేశారు.