సినిమాల తయారీ ఇక సులభతరం -FDC ఛైర్మన్ దిల్ రాజ్
FDC Chairman Dil Raj

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ, సినిమాల చిత్రీకరణలకు కావాల్సిన పలు అనుమతులు, సినిమా థియేటర్ ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తోంది. ఈ సులభతర అనుమతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ” పై నేడు సంబంధిత శాఖలు, ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో ప్రత్యేక వర్క్-షాప్ జరిగింది. బేగంపేట్ లోని టూరిజం ప్లాజా లో జరిగిన ఈ వర్క్ షాప్ కు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, తెలంగాణ ఎఫ్.డీ.సీ మేనేగింగ్ డైరెక్టర్ సి.హెచ్ ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎం.డీ వల్లూరు క్రాంతి లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈసందర్బంగా ఎఫ్.డీ.సి చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రకాల చేయూతనిస్తున్నారని, ఈ సదావకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్ తో వస్తే వారి సినిమా నిర్మాణానికి కావాల్సిన షూటింగ్ లొకేషన్లు, వారికి వివిధ శాఖలనుండి కావాల్సిన అనుమతులు, సినీ నిర్మాణానికి సంబందించించిన సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్లు,హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నామన్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఈవిధమైన సౌలభ్యం మొట్టమొదటిసారిగా తెలంగాణా లో మాత్రమే రూపొందిస్తున్నామని దిల్రాజు అన్నారు.
దీనితోపాటు, సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్ జారీ విధానాన్ని కూడా ఆన్లైన్ ద్వారా పొందే సులభతరం విధానాన్ని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. సినిమా థియేటర్ల నిర్వహణకు ఇప్పటివరకు నగరాల్లో అయితే సంబంధిత పోలీసు కమీషనర్లు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో అయితే ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు జారీ చేసేవారని, ఇకనుండి ఈ అనుమతులన్నింటినీ ఆన్లైన్ విధానం ద్వారా జారీచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ హోమ్ శాఖ తో చర్చించి విధి విధానాలు రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ వెబ్-సైట్ రూపకల్పన కు సంబంధించి తగు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా చిత్ర పరిశ్ర ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను ఆయన కోరారు. ఈ వెబ్ సైట్ ను పూర్తి స్థాయిలో రూపొందించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి లతో ప్రారంభిస్తామని తెలియచేసారు.