జాతీయ గీతం పాడము అనేవాళ్లు దేశంలో అవసరమా? ఎంపీ రఘునందన్ రావు
దేశంలో కొంతమంది తాము జాతీయ జెండా ఎగురవేయమని, జాతీయ గీతం పాడమని అంటున్న వారు దేశంలో ఉండడం అవసరమా ఆలోచించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఏ దుర్మార్గుడు అయితే జాతీయ జెండా ఎగుర వేయని, పాలస్తీనా జిందాబాద్ అని పార్లమెంట్ లో నినాదాలు చేశాడని ఎంఐఎం ఎంపీ అసద్దుద్ధీన్ ను ఉద్ధేశించి పరోక్షంగా విమర్శించారు. అలాంటి వాళ్ళని ఈ దేశంలో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం తేవాలని అభిప్రాయపడ్డారు.
సోమవారం సిద్దిపేట జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాల పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి వ్యక్తి తన ఇంటి పై జాతీయ జెండా ఎగుర వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని తెలిపారు. బంగ్లాదేశ్ లో విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తే ఆ దేశ ప్రధాని దేశం విడిచి భారతదేశాన్ని శరణు గోరే పరిస్థితి వచ్చిందన్నారు. మన దేశ గౌరవాన్ని కాపాడని వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం చేసేందుకు ఆలోచన చేస్తున్నామని రఘునందన్ రావు తెలిపారు.



