CM Revanth: కిషన్ రెడ్డి మోసం చేస్తున్నడు
నాగ్‌పూర్: మహారాష్ట్ర ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఓ నేషనల్ మీడియా చానెల్ తో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరును విమర్శించారు. ‘‘దాదాపు 50 వేల మందికి పైగా తరలించి.. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు కిషన్ రెడ్డి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మూసీ సుందరీకరణ చేపడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ మోడల్ గుజరాత్ మోడల్‌కు కౌంటర్ మోడల్ కాబోతున్నది. ఇది సక్సెస్ అయితే కాంగ్రెస్ మోడల్ ఈ దేశంలో దిక్సూచిగా నిలుస్తుంది. అప్పుడు గుజరాత్ మోడల్ ను ఎవరూ పట్టించుకోరు. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో చేసుకోండి.. మేము చేసేది మేం చేస్తాం. మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు”అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
మా ఎజెండా అభివృద్ధి: ఎంపీ చామల
మహారాష్ట్ర ప్రచారంలోనే ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మూసీ ప్రక్షాళన విషయంపై మాట్లాడారు. ‘‘మా ఎజెండా.. అభివృద్ధే… హైదరాబాద్‌లో మూసీ నదీగర్భంలో, మూసీకి అడ్డంగా ఎలా ఆక్రమణలు జరిగాయో ఆరా తీస్తున్నాం… మూసీకి పునర్వైభవం తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి”అని ఆయన పేర్కొన్నారు.



