ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన డీఎంకే నేతలు
ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన డీఎంకే నేతలు
పల్లవి, వెబ్ డెస్క్: నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చి ఆహ్వానించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలతో ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జేఏసీ సమావేశానికి ఆహ్వానం అందిందని తన పార్టీ అనుమతితో ఈ మీటింగ్ కు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడం, 2029 ఎన్నికల వరకు జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చెన్నై మీటింగ్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. బీజేపీ నేతలను కూడా అఖిలపక్షానికి ఆహ్వానిస్తామన్నారు.



