19 నుంచి సీఎం జిల్లాల బాట
- వచ్చే నెల 9వ తారీఖు వరకు పర్యటన
- అధికారంలోకి ఏడాది సందర్భంగా టూర్
- 19న వరంగల్ లో మహిళా సదస్సు
- 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన
- 25న కరీంనగర్ లో యువజన సదస్సు
- నెలాఖరున పాలమూరు జిల్లాలో రైతు సదస్సు
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి వేడుకలు
పల్లవి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈనెల 19 నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు పలు జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. సీఎం వెంట మంత్రివర్గ సభ్యులతో పాటు సీఎం ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. 19న వరంగల్ లో మహిళా సదస్సు పేరుతో సీఎంతోపాటు మంత్రులందరు పర్యటిస్తారు. ఆ మరుసటి రోజు 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం పర్యటిస్తారు. సిరిసిల్లలో ఎస్పీ కార్యాలయం ప్రారంభించడంతో వేములవాడ రాజన్నను దర్శించుకుని ఆలయ అభివృద్ధి తోపాటు రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల నేత కార్మికులకు బాసటగా నిలిచేలా 50 కోట్లతో యార్న్ డిపోకు భూమిపూజ చేయనున్నారు. రాజన్న జాతర గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
25న కరీంనగర్ లో యువజన సదస్సు
జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 25న కరీంనగర్ లో పర్యటించి యువజన సదస్సులో పాల్గొననున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లేదా అంబేద్కర్ స్టేడియంలో యువజన సదస్సు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెలాఖరున మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సదస్సు నిర్వహించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్నివాల్ గా మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.



