సీఎం రేవంత్ పై ఫిర్యాదు
సీఎం రేవంత్ పై ఫిర్యాదు
పల్లవి, వెబ్ డెస్క్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్ల కనీస గౌరవ మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా మొన్న రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ..‘స్ట్రేచర్ ఉందని విర్రవీగారు.. స్ట్రెచర్‌పై పడ్డారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలని.. లేకపోతే స్ట్రెచర్ నుంచి మార్చురీలోకి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ చావు కోరుతున్నారని, ఇది కనీస మర్యాద కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు సీఎంపై ఫిర్యాదు చేశారు.





