Phone tapping case : సారుకెప్పుడు నోటీసులు?
- ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్దలపై చర్యలేవి?
- లీకులు ఇచ్చి..హైప్ సృష్టించి వదిలేసిన వైనం
- రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు
- ఇప్పటి వరకు ఆయనకు నోటీసులు ఇవ్వని సిట్
- చిన్న లీడర్లకు మాత్రం నోటీసులు.. విచారణ
- చిరుమర్తి, జైపాల్ యాదవ్ స్టెట్మేంట్ రికార్డు చేసిన అధికారులు
- నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని ఫోన్ ట్యాపింగ్ కేసు
పల్లవి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా.. తాజాగా నాయకుల వంతు మొదలైంది. ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న పెద్దలకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వని సిట్.. ఫోన్ కాల్ డేటా ఆధారంగా చిన్న నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరు బయటకు వచ్చినా.. ఆయనకు ఇప్పటి వరకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారికి కాకుండా చిన్న చిన్న లీడర్లకు నోటీసులు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఎందుకింత ఆలస్యం?
ఎస్ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో లీడర్లలో ముందుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో గతంలోనే తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్‌కుమార్ అందించే వివరాలతో.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. మూడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ విరివిరిగా వాడుకున్నామని, బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు కూడా.
వీరి స్టేట్ మెంట్ ఆధారంగా కేసీఆర్‌కు నోటీసులు?
గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఈ సమయంలో ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొందరి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌కు నోటీసులు ఎందుకివ్వడం లేదు? ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందా? ఇందులో అధికారులకు సరైన ఆధారాలు లభించలేదా? అనే పలు అనుమానాలకు తావునిస్తోంది. ఇదే కేసులో మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారించగా వారి స్టెట్ మేంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు. వారు ఇచ్చిన స్టెట్మెంట్లో మరోసారి గులాబీ అధినేత కేసీఆర్ పేరు బయటకు వస్తే కచ్చితంగా ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది.



