స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించరా? – బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్

పల్లవి, హైదరాబాద్: ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశామని.. పంచాయతీలకు నిధులు ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. సర్పంచ్ లు, జడ్పీటీసీల టర్మ్ ముగిసినా ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.
స్థానిక సంస్థలకు ఎన్నికల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజీనామా చేసిన తర్వాతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి గతంలో ఏపీలో కలిపిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు, లోయర్ సీలేరును మనకు వచ్చేలా చేయాలని హరీశ్ రావు కోరారు. ఆ తర్వాత విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.