దురుసుగా ప్రవర్తిస్తే బౌన్సర్ల తాట తీస్తాం: సీపీ సీవీ ఆనంద్
పబ్లిక్‌తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు

పబ్లిక్‌తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఎక్కడైనా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో జాగ్రత్త వహించాలి’ అని సీపీ హెచ్చరించారు.
సంధ్య థియేటర్ ఘటనపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని.. మేనేజర్ తాను చెప్తా అన్నాడని వెల్లడించారు. దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు.