ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

పల్లవి, హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా పుంజుకుంటున్న భారతీయ జనతా పార్టీ.. త్వరలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించింది. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల విషయానికొస్తే.. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావేత్త మల్క కొమరయ్యను ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి. అంజిరెడ్డిని ప్రకటించింది. ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డిని ప్రకటించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎంతో మంది పోటీ పడినా.. విజయం సాధించడమే లక్ష్యంగా కమలం పార్టీ గెలుపు గుర్రాలకు టికెట్లు ఖరారు చేసింది. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించకపోగా.. ఈసారి బీజేపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల గ్రౌండ్ ను ముందుగానే సిద్ధం చేసుకున్నది.