విద్యావేత్త మల్క కొమరయ్యను వరించిన ఎమ్మెల్సీ టికెట్
విద్యావేత్త మల్క కొమరయ్యను వరించిన ఎమ్మెల్సీ టికెట్

- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కమలం పార్టీ
- బీజేపీ రాష్ట్ర నాయకులు, విద్యావేత్తకు దక్కిన టికెట్
- ఎమ్మెల్సీ స్థానం పరిధిలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు
- విజయావకాశాలు మెండుగా ఉన్న నేతను బరిలోకి దింపిన అధిష్టానం
- అభ్యర్థి ప్రకటనలో మిగతా పార్టీల కంటే ముందున్న బీజేపీ
ఆదిలాబాద్– నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ రాష్ట్ర నాయకులు, విద్యావేత్త మల్క కొమరయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి ఎంతో మంది పోటీపడినా.. విద్యారంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న మల్క కొమరయ్య వైపే అధిష్టానం మొగ్గుచూపింది.
పల్లవి, హైదరాబాద్: ఆదిలాబాద్– నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థి మల్క కొమరయ్య.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన స్థానిక వ్యక్తే. విద్యారంగ సమస్యలపై అవగాహన, సేవాగుణం, నిరాడంబరత కలిగిన మల్క కొమరయ్య పుట్టి పెరిగింది పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలోనే. 1959 అక్టోబర్ 1న బంధంపల్లిలోని ఓ వ్యవసాయ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన.. ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే కరీంనగర్ లో ఇంటర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
రిమార్కబుల్ ప్రాజెక్టులు చేపట్టి..
ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రఖ్యాత వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొమరయ్య.. చదువుకున్న విద్యను ఆచరణలో పెట్టారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఎవరికీ తెలియని ఆ రోజుల్లోనే.. రిమార్కబుల్ ప్రాజెక్టులెన్నో చేపట్టి.. సివిల్ ఇంజనీరింగ్ లో అద్భుతాలను పరిచయం చేశారు. హైదరాబాద్ ఐకాన్ గా పిలవబడుతున్న మినర్వా కాంప్లెక్స్, జూబ్లీహిల్స్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, మహేంద్రహిల్స్ లోని ధనలక్ష్మీకాలనీ,మాధాపూర్ లో పల్లవి ఎన్ క్లేవ్, సికింద్రాబాద్ లో భువన టవర్స్ లాంటి ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను కొమరయ్య ఆ కాలంలో సృష్టించారు. ఢిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో కూడా ఆయన ఎన్నో సోషల్ ప్రాజెక్టులు చేపట్టారు.
విద్యారంగంలో సేవలు..
హైదరాబాద్ లో 1994లో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ను స్థాపించి దశాబ్దాలుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహోత్తరమైన యజ్జాన్ని కొనసాగిస్తున్నారు. పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి ఇంజినీరింగ్ కాలేజీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. 2022–2003 మధ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజ్ లను తీసుకొని ఆ బ్రాంచ్ లను సిటీ నలుమూలలా విస్తరించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మరెంతో మంది స్టూడెంట్లను మేధావులుగా మార్చి సమాజానికి అందించారు. కొమరయ్య వద్ద విద్యనేర్చుకున్న ఎంతో మంది స్టూడెంట్స్ ఇప్పుడు దేశంలో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ప్రఖ్యాత అడ్వకేట్లు, డాక్టర్లు, సైంటిస్టులుగా దేశానికి సేవలందిస్తున్నారు.
ఆరోగ్య సేవలు..
స్వతహాగా సేవా గుణం కలిగిన కొమరయ్య.. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు నాచారంలో ప్రసాద్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. నిత్యం వెయ్యి మంది వరకు ఈ హాస్పిటల్స్ లో సేవలు పొందుతున్నారు. అంతేకాకుండా హాస్పిటల్ కు కూడా రాలేని స్థితిలో ఉన్న పేదల కోసం ఆయన మరొక అడుగు ముందుకు వేసి.. పేదల బస్తీల్లోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ.. వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా ఏటా నిర్వహించే వందలాది హెల్త్ క్యాంప్స్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ప్రకృతి ప్రేమికుడిగా..
పర్యావరణ పరిరక్షణ కోసం మల్క కొమరయ్య.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్నారు. ప్లాస్టిక్ భూతం యావత్తు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యంలో.. డీఆర్డీవో టెక్నాలజీతో ‘ఎకో భారత్’ అనే ప్లాంట్ నెలకొల్పి భూమిలో తేలిగ్గా కలిసి పోయే డీగ్రేడబుల్ కవర్స్ తయారు చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా పర్యావరణ హితమే ధ్యేయంగా ఆ కవర్లను మార్కెట్ కు అందిస్తున్నారు. వ్యవసాయ, ఇతర వ్యర్థాల నుంచి పవర్ జనరేట్ చేసేందు కోసం ఆయన ‘శాలివాహన గ్రీన్ ఎనర్జీ’ని నెలకొల్పారు.
తెలంగాణ వాదిగా..
చరిత్రలో తెలంగాణ ఉద్యమానిది చెరగని సంతకం. స్వరాష్ట్రం కోసం తెలంగాణ సబ్బండవర్గాలు రోడ్డెక్కి కొట్లాడారు. నిఖార్సైన తెలంగాణ వ్యక్తిగా మల్క కొమరయ్య.. తెలంగాణ ఉద్యమంలో అన్ని సమయాల్లో అండగా నిలిచారు. పలు సభలు, వేదికలపై ప్రజా యుద్ధ నౌక గద్దర్ లాంటి వారు అత్యంత ఆప్యాయంగా స్పందిస్తూ.. ‘‘కొమురన్న లాంటి వాళ్ళు మన తెలంగాణలో ఉండటం అదృష్టం’’ అనేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మల్క కొమరయ్య కృషిని గద్దర్ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ నేపథ్యం..
విద్య, వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించిన మల్క కొమరయ్య.. ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై.. బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర నాయకుడిగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించిన మల్క కొమరయ్య.. చివరి వరకు ప్రయత్నం చేసి.. అధిష్టానం విజ్ఞప్తి మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటల రాజేందర్ కు మద్దతు ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ గడ్డ మీద ఆయన వేసిన మొదటి అడుగు నుంచి నేటి వరకు ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
అవార్డులు..
సాధారణ వ్యక్తిగా మొదలై అసాధారణ వ్యక్తిగా ఎదిగిన మల్క కొమరయ్యను వివిధ రంగాల్లో ఎన్నో అవార్డులు వరించాయి. విద్యారంగంలో ఆయనకు బెస్ట్ అవార్డ్ వచ్చింది. మానవ హక్కుల కోసం చేసిన కృషికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు మల్క కొమరయ్య. ఇవి ఆయన కృషిని తెలిపే కొన్ని మచ్చు తునకలే తప్ప.. కొమరయ్య ప్రశంసల కోసం పాకులాడలేదు.. అవార్డుల కోసం పైరవీలు చేయలేదు.