MLC Elections: BRS, కాంగ్రెస్ కు భారీ షాక్
MLC Elections: BRS, కాంగ్రెస్ కు భారీ షాక్

పల్లవి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భారీ షాక్ తగినట్లు అయింది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు అటు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గాని అభ్యర్థులను ప్రకటించలేదు. కాగా ఈ రెండు పార్టీలకు అభ్యర్థుల ప్రకటన, నామినేషన్, ప్రచారం తదితర కార్యక్రమాలకు నెల రోజుల సమయం మాత్రమే మిగిలింది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించింది. మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం కూడా దాదాపు సగం పూర్తి చేశారు.
ప్రచారంలో ముందున్న బీజేపీ
తెలంగాణలో మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. కాగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా మల్క కొమురయ్యను ప్రకటించిన బీజేపీ అదే నియోజకవర్గం గ్రాడ్యుయేట్ స్థానంలో సి. అంజిరెడ్డిని బరిలోకి దింపింది. మరోవైపు వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించింది. ఈసారి అన్ని పార్టీలకన్నా ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నది. కాగా ఉత్తర తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఆ పార్టీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం విశేషం.