వీళ్ల దుంపతెగ : ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్రు!
హైదరాబాద్ లో విస్కీ ఐస్‌క్రీమ్ లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ అండ్ ఫైవ్ పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా ఈ అసలు విషయం బయటపడింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 అండ్ 5లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో గుట్టుచప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మిల్లీ గ్రాముల విస్కీ కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే ఐస్‌క్రీమ్‌కు అలవాటు పడి చిన్న పిల్లలు, యువత దీనికోసం ఎగబడుతున్నారు. వన్ మోర్ అంటూ ఆర్డర్లు పెడుతున్నారు. మరింత అమ్మకాలు పెంచుకునేందుకు యజమానులు ఓ అడుగు ముందుకు వేసి ఫేస్ బుక్‌లో ఒక యాడ్ కూడా ఇచ్చారు. విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్న అరికో పార్లల్ సంస్థ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీటిని ఎప్పటినుంచి తయారు చేస్తున్నారు. ఎంతమందికి విక్రయించారో ఆరా తీస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



