ఇంట్లో వెలిగించిన అమ్మవారి దీపం.. ఏడుగురు సజీవదహనం!
ముంబైలోని చెంబూర్ లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంట్లో వెలిగించిన దీపమే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు గుర్తించారు
ముంబైలోని చెంబూర్ లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంట్లో వెలిగించిన దీపమే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు గుర్తించారు. రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో దీపం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు.
దీనికి తోడు కిరాణ షాపులో 25 లీటర్ల కిరోసిన్ ను నిల్వ ఉంచారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించడంతో నిద్రలోనే ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కన్నుమూశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం 5.20 గంటల ప్రాంతంలో జరిగింది. మృతులను పారిస్ గుప్తా (7), మంజు ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (39), ప్రేమ్ గుప్తా (30), నరేంద్ర గుప్తా (10)గా గుర్తించారు.
మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం సంతాపాన్ని ప్రకటించింది. మృతుల కుంటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.



