DPS: పర్యావరణాన్ని రక్షించుకుందాం

పల్లవి, హైదరాబాద్: పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం ప్రిన్సిపల్ సునీత రావు యశస్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భూగ్రహాన్ని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ.. సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిల నుంచి టీచర్ల బృందం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అవగాహన కల్పించారు. ‘‘ఎకో సిస్టమ్ పునరుద్ధరణ”అనే థీమ్ తో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ విశేషంగా ఆకట్టుకున్నది.గత 12 సంవత్సరాలుగా పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ డీపీఎస్ పలు అవార్డులను అందుకుంది. ఇటీవల GENCAN అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా డీపీఎస్ నాచారం ప్రిన్సిపల్ సునీత రావు మాట్లాడుతూ.. 2024–-25 విద్యా సంవత్సరంలో డీపీఎస్ నాచారం క్యాంపస్ లో పచ్చదనం, పర్యావరణ అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించుకోవడం గురించి చెప్పారు. హరితహారం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా గవర్నెన్స్ హెడ్స్.. పాఠశాల సీనియర్ ప్రిన్సిపాల్ కు కుండీలో పెట్టిన మొక్కను అందజేశారు. అనంతరం పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి, భవిష్యత్ తరాల కోసం గ్రహాన్ని సంరక్షించడానికి కట్టుబడి ఉంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.


