ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ ఖాతాదారులకు బిగ్ షాకిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు కొత్త సేవింగ్స్ అకౌంట్లలో పాటించాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ ను ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో కనీసం బ్యాలెన్స్ అమౌంట్ ను యాబై వేల రూపాయలుగా చేసింది. సెమీ -అర్భన్ , గ్రామీణ ప్రాంతాల్లో ఇది వరుసగా ఇరవై ఐదు వేలు, పదివేలు రూపాయలుగా ఖరారు చేసింది.
ఆగస్టు ఒకటో తారీఖు తర్వాత తెరిచిన సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమే ఇది వర్తించనున్నది. అంతకుముందు తెరిచిన పొదుపు అకౌంట్ల ఖాతాలకు ఈ పెంపు వర్తించదని ప్రకటించింది. అంతకుముందు తెరిచిన సేవింగ్స్ ఖాతాలకు నెలవారీ కనీస బ్యాలెన్స్ పదివేల రూపాయలుగా ఉంది.
ఎంఏబీ నిబంధనలను పాటించకపోతే తగ్గిన మొత్తానికి సంబంధించి ఆరు శాతం లేదా రూ ఐదు వందల మేర ఛార్జీలు వర్తిస్తాయి. శాలరీ ఖాతాలు, పీఎం జన్ ధన్ ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు అధిక ఎంఏబీ వర్తించదు. అధిక ఎంఏబీ వర్తించే ఖాతాదారులకు ఉచిత నెఫ్ట్ ఫండ్ ట్రాన్స్ ఫర్ , కాంప్లిమెంటరీగా నెలకు మూడు నగదు లావాదేవీలు మొదలైన ప్రయోజనాలు లభిస్తాయి.